ఇసుక లారీల ద‌న దాహానికి ఎంత మంది బ‌లికావాలి: ఉత్త‌మ్‌

హైదరాబాద్, ఆగస్ట్ 2: ఇసుక మాఫియా ద‌న దాహానికి మ‌రో ద‌ళిత కుటుంబం బ‌జారున‌ప‌డింద‌ని, ఒక ద‌ళితుడి ప్రాణం ఇసుక లారీ కింద న‌లిగిపోయింద‌ని, పాల‌కుల దన దాహం ఎంత‌మంది ద‌ళితుల ర‌క్తం తాగితే తీరుతుంద‌ని టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విరుచుప‌డ్డారు. 

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండ‌లం పోతుగ‌ల్ గ్రామంలో గిన్నె శంక‌ర్ అనే ద‌ళిత రైతు పొలం వ‌ద్ద‌కు వెళుతుండ‌గా ఇసుక లారీ డీ కొన‌డంతో తీవ్ర గాయాల పాల‌య్యాడ‌ని, ఆయ‌న‌ను స‌మీపంలోని ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ ప‌రిస్తితి విష‌మించ‌డంతో హైద‌రాబాద్ నిమ్స్‌కు త‌ర‌లించార‌ని అక్క‌డ చికిత్స పొందుతూ శంక‌ర్ మృతి చెందార‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ విష‌య‌మై ఆయ‌న స్పందిస్తూ గ‌త కొంత‌కాలంగా సిరిసిల్ల ఇసుక మాఫియా విష‌యంలో కాంగ్రెస్ పోరాటం చేస్తుంద‌ని ఇంత జ‌రుగుతున్నా కూడా ఇసుక మాఫియా ఆగ‌డాలు, అధికార పార్టీ, కేసిఆర్ కుటుంబం, కేటిఆర్ స్వ‌యంగా ఇసుక మాఫియాకు అండ‌గా ఉండ‌డంతో వారు చెల‌రేగిపోతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌తి ప‌ది రోజుల కొక‌సారి ఇసుక లారీ ప్ర మాదం జ‌రుగుతుంద‌ని, దుమ్ము, దూళిల‌తో, శ‌బ్దాల‌తో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ప్ర‌జ‌ల ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నా కూడా, కేటిఆర్ త‌న ద‌న దాహానికి జ‌నాన్ని బ‌లి తీసుకుంటున్నాడ‌ని,  డ‌బ్బు పిచ్చి ప‌ట్టిన వాడిలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని ఆయ‌న తీవ్రంగా దుయ్య బ‌ట్టారు. 

సిరిసిల్ల ఎమ్మెల్యేగా అక్క‌డి ప్ర‌జ‌లు ఓట్లు వేస్తే గెలిచి ఇప్ప‌డు మంత్రి అయి, అధికారాన్ని అనుభ‌విస్తూ ఇప్ప‌డు అక్కడి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెలాగాట‌మాడుతూ వ్యాపారం చేస్తున్నాడ‌ని, ఇసుక మాఫియాలో కేటిఆర్ స‌మీప బంధువు, సోద‌రుడి వ‌ర‌స అయ్యే సంతోష్ కుమార్‌కు వాటాలున్నాయ‌ని తాము డాక్యుమెంట్ల‌తో స‌హా నిరూపించినా కూడా సిగ్గు లేకుండా మాఫియాల‌ను ప్రోత్స‌హించే విధంగా వారికే స‌హాకారం అందిస్తున్నాడ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

ఇసుక మాఫియాలు ఇచ్చే క‌మీష‌న్ల క‌క్కుర్తితో 12 మందిపై కేసులు పెట్టించి 8 మందిని థ‌ర్డ్ డిగ్రీ పెట్టి చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తే న‌లుగురే ద‌ళితులు క‌దా అంటు అహాంకార‌పు మాట‌లు మాట్లాడార‌ని, ఎంత మంది ప్రాణాలు పోతే ఎంత‌మంది చిత్ర హింస‌ల‌కు గురి అయితే కేటిఆర్ స్పందిస్తార‌ని ఆయ‌న‌కు ఓట్లు వేసిన పాపానికి ద‌ళితులు, బిసీలు, ఎస్‌.టిలు బ‌లి కావాలా అని ప్ర‌శ్నించారు.

ఈ రోజు కేటిఆర్ పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌తో సిరిసిల్ల‌లో ప‌ర్య‌టించార‌ని ఇదే స‌మ‌యంలో లారీ ప్ర‌మాదంలో మ‌రో ద‌ళితుడు బ‌లి అయ్యార‌ని అయినా కూడా కేటిఆర్ నుంచి స్పంద‌న లేక‌పోవ‌డం, విచార‌క‌ర‌మ‌ని ఇంత‌కంటే నీచ‌మైన పాల‌కుల‌ను ఎక్క‌డా చూడ‌లేద‌ని అన్నారు. సిరిసిల్ల‌లో జ‌రుగుతున్న ప్ర‌మాదాల‌ను కేటిఆర్ హ‌త్యలుగా భావిస్తున్నామ‌ని, ఆయ‌న హ‌త్య‌కేసులు న‌మోదు చేయాల‌ని, కేటిఆర్ వెంట‌నే రాజీనామా చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

ఇసుక మాఫియాలు ఇచ్చే క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తి ప‌డి త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెలగాల‌మాడుతున్న కేటిఆర్‌, బకాసురుని కంటే అధ్వాన్న‌మైన రాక్ష‌సునిలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని, కేటిఆర్ ద‌న దాహానికి అక్క‌డి ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ణంగా ప‌ట్టాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు.  ద‌ళిత రైతు శంక‌ర్ మృతికి త‌న ప్ర‌గాడ సంతాపం వ్య‌క్తం చేస్తున్నామ‌ని, ప్ర‌భుత్వం శంక‌ర్ కుటుంబాన్ని అన్ని ర‌కాలుగా ఆదుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.