ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం 2709 ఎకరాల భూసేకరణ: హరీశ్ రావు

హైదరాబాద్, జూలై 31: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లో భాగంగా సేకరించిన అటవీ భూములకు గాను ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకం కోసం 2709 ఎకరాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని మంత్రులు హరీశ్ రావు,తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం సేకరించవలసిన భూముల గురించి సెక్రెటేరియట్ లో సోమవారం నాడు మంత్రులు సమీక్షించారు. 

మొత్తం 2709 ఎకరాల భూమిని సేకరించవలసి ఉందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని హరీశ్ రావు కోరారు.ఈ ప్రక్రియ కోసం 'ల్యాండ్ బ్యాంకు'ఏర్పాటు చేసుకోవాలని  అన్ని జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు.ఖమ్మం జిల్లాలోని సీతారామ తో పాటు  రోళ్ల వాగు, పాలెంవాగు మీడియం ప్రాజెక్టులు ఇంకా ఎలిమినేటిమాధవరెడ్డి ప్రాజెక్టు,దేవాదుల, కల్వకుర్తి,డిండి,తదితర ప్రాజెక్టులు, యింకా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులలో పెండింగులో ఉన్న భూసేకరణ కు ఆటవీఅనుమతుల సమస్యలపై మంత్రులు చర్చించినారు.ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం భూసేకరణ సమస్యలను,అటవీ శాఖ అనుమతి సమస్యలు సుదీర్ఘంగా చర్చించినారు. ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్.జోషి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఈ. ఎన్. సి.మురళీధరరావు, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఝా, ఆదనపు పి.సి.సి.ఎఫ్.శోభ, వివిధ ప్రాజెక్టుల సి.ఈ. లు పాల్గొన్నారు.