కేటిఆర్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, జూలై 26: ఇసుక ఆదాయం గురించి అబద్దాలు చెబుతున్నవు... చారణ ప్రభుత్వం పొందుతుంటే బారాణ నీ అనుచరులు, పార్టీ నాయకులు దోచుకుంటున్నారు, 400 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్న నీవు.. నాలుగు వేల కోట్లు దోచుకున్నదెవరో చెప్పు, ఇసుక రీచ్‌ల కాంట్రాక్టర్లు ఎవరు, నీ కుటుంబ సభ్యులు, నీ బందువులు కారా, గుంట నక్కలా అమెరికా నుంచి వచ్చి తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి మంత్రివి అయి, తోడేలులా దోచుకుంటున్నవని ఐ.టి మంత్రి కేటిఆర్‌పై కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడ్డారు.
బుధవారం నాడు గాంధీభవన్‌లో ముఖ్య అధికార ప్రతినిధి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవన్, టిపిసిసి ఉపాధ్యక్షులు ప్రసాద్ కుమార్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, క్రిషాంక్, ఇందిరా, నాయకులు కేకే మహేందర్ రెడ్డిలు గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దాసోజు శ్రవన్ మాట్లాడుతూ కేటిఆర్ కాంగ్రెస్ పైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన మాట్లడిన తీరును తప్పు పడుతూ ఖండించారు, ఆ మాటలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక పేరుతో కాంగ్రెస్ వ్యాపారం చేయలేదు, ఇసుకాసురులు మీరు, మీ కుటుంబ సభ్యులు ఇసుక పేరుతో దోచుకున్నారు, ఇసుక టెండర్ల సమయంలో కేవలం ఒకే రోజు సమయం ఇచ్చి ఇసుక రీచ్‌లన్నీ కేసిఆర్ కుటుంబ సభ్యులు, టిఆర్ ఎస్ నేతలు కాంట్రాక్ట్ పొందిన విషయం వాస్తవం కాదా ? పర్యావరణ నిబంధనలన్నీ తుంగలో తొక్కి, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పక్కన పెట్టి ఇసుకను తోడుకొని ట్రక్కు రూ.8,250 ప్రభుత్వానికి కట్టి, బయట 80 వేల రూపాయలకు అమ్ముకున్నారు, గోల్డ్ మైన్స్ మినరల్ కంపెనీలో సంతోష్ కుమార్ కేసిఆర్ సడ్డకుడి కొడుకు కాదా.. ఆయన దోచుకున్న దోపిడీలో కేసిఆర్ కుటుంబానికి వాటాలు లేవా అని ఆయన నిలదీశారు. అందుకు సంబంధించిన భాగస్వామ్య ఒప్పంద పత్రాలను చూపించారు.
ఇసుక మాఫియా ఆగడాలు చేస్తూ సిరిసిల్ల ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటే ప్రజలకు అండగా ఉండాల్సిన కేటిఆర్, దళితులను, ప్రజలకు నిర్భందించి చిత్ర హింసలకు గురి చేసిన పోలీసులకు వత్తాసు పలుకుతూ ప్రజలకు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇసుక మాఫియా, దోపిడీ విషయంలో బహిరంగ చర్చకు సిద్దమా, ఎక్కడికి రమ్మంటావు, అమర వీరుల స్థూపం వద్ద కూర్చుందామా, తెలంగాణ భవన్లో కూర్చందామా చెప్పు అంటు నిలదీశారు. సిరిసిల్లలో జరిగిన పోలీసుల దాడులలో తీవ్రంగా గాయపడ్డ వారిని పోలీసులు జైలుకు పంపితే జైలర్ వారి గాయాలు చూసి జైలులో చేర్చుకోలేదని, జైలర్ ఉన్న సోయి కూడా కేటిఆర్‌కు లేదా అని ఆయన ప్రశ్నించారు.
టిపిసిసి అధ్యక్షులపై కేటిఆర్ చేసిన వ్యాఖ్యలపై శ్రవన్ మండిపడ్డారు, ఉత్తమ్ కాలిగోటికి సరిపోవని, ఆయన శత్రు దేశాలతో పోరాడిన సైనికులు, నువ్వు గుంటనక్కవు నీవు ఉత్తమ్‌ను విమర్శిస్తవా అని ఆయన అన్నారు. వెబ్ సైట్లతో గ్యాంగ్స్టర్ల లా ప్రవర్తిస్తున్న కేటిఆర్ తప్పడు ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కేటిఆర్ తనకు ఎలాంటి కంపెనీలు లేవని, 2007లోనే తనకు ట్రాక్టర్ల కంపెనీ ఉంటే మూత పడిందని, కేటిఆర్ పచ్చి అబద్దాలు ఆడారు, 2007, మే 17న హిమాంశు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టిన కేటిఆర్ ఆ విషయాన్ని 2014 తన ఎన్నికల అఫడవిట్లో కూడా ప్రస్తావించావు, 2015లో ఐ.టి రిటర్న్ కూడా దాఖలు చేశారని, ఇప్పటికీ ఇంకా ఆ కంపెనీ కొనసాగుతుందని ఆయన వివరించారు. ఇలా కంపెనీ కొనసాగుతున్నా కూడా నిర్లజ్జగా కేటిఆర్ బరితెగించి అబద్దాలు ఆడారని ఆయన విమర్శించారు. టిఆర్ ఎస్ అంటే మోసగాళ్ళు, దోపిడీదార్ల సమితిగా మారిందని ఆయన విమర్శించారు.
తెలంగాణను అడ్డుకున్న ఆంద్రా పెత్తందార్లు పెద్ద కొడుకు వెంకయ్య నాయుడు అని అనేక సార్లు తిట్టిన టిఆర్ ఎస్ నేతలు ఇప్పుడు ఆయన కొడుకు కంపెనీ హర్ష మోటార్స్‌కు ఇన్నోవాలు, ఆయన బిడ్డ స్వర్ణ భారతీ ట్రస్ట్ 2 కోట్ల రూపాయల పన్నలు మినహాయింపులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇసుక మాఫియా, కేటిఆర్ కంపెనీలు, స్వర్ణ భారతీ ట్రస్ట్, తదితర అంశాలపై బహిరంగ చర్చకు వస్తారా అని ఆయన నిలదీశారు. అనంతరం అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను ముసలి నక్క అన్న కేటిఆర్, ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ పార్టీలో అన్ని అనుభవించిన కేకే, డిఎస్‌లు ఎక్కడున్నారో చెప్పాలని ఆయన అన్నారు.
కేటిఆర్ కుటుంబం,లాండ్ మాఫియాలో, సాండ్ మాఫియాలో, డ్రగ్స్ మాఫియాలో ఉన్నారని ఇప్పడు దోషులుగా ఉన్న వారిని కాపాడేందుకు కేటిఆర్ కాపాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్‌లు మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో కేటిఆర్‌కు సంబంధాలున్నాయని, ఆయన కొడుకు చదువుకునే పాఠశాల పేరు వచ్చినా నేడు విచారణలో లేదని, హైదరాబాద్‌లో ఆయన బంధువుల పబ్‌లు విచ్చలవిడిగా సాగుతున్నాయని విమర్శించారు.