సిరిసిల్ల దళితులపై దాడుల నేపథ్యంలో కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నిరసనలు
హైదరాబాద్, జూలై 26: సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరేళ్ళ గ్రామంలో ఇసుక మాఫియా ఆగడాలకు అక్కడ జనం బలవుతున్నారని, నిరసన వ్యక్తం చేసిన దళితులు, ఇతర వర్గాలకు చెందిన 12 మందిని పోలీసులు కొట్టి చిత్రహింసలకు గురి చేసి తీవ్రంగా గాయపరిచారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

సిరిసిల్ల దళితులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలకు గురి చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు, కలెక్టర్కు వినతిపత్రాల సమర్పణ చేశారు. ఖమ్మంలో టిపిసిసి కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, మండలి విపక్ష ఉప నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు సత్యం, నిజామాబాద్లో మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, అధ్యక్షులు తాహెర్ అహ్మద్, అధికార ప్రతినిధి మహేశ్ కుమార్, మెదక్ జిల్లాలో మాజీ మంత్రి గీతారెడ్డి, డిసిసి అధ్యక్షురాలు సునితా లక్ష్మారెడ్డి, కరీంనగర్ జిల్లాలో ఎం.ఎల్.ఎ జీవన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు మృత్యంజయం, మాజీ ఎం.పి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీదర్ బాబు, మహబూబ్నగర్లోఎం.ఎల్.ఎ డికె అరుణ, సంపత్ కుమార్, డిసిసి అధ్యక్షులు ఒబేదుల్ల, టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి, రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్ కుమార్, మాజీ ఎం.ఎల్.ఎలు సుదీర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు క్యామ మల్లేశ్ తదితరులు పాల్లొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లడుతూ మంత్రి కేటిఆర్ నియోజకవర్గంలో దళితులపైనా ఇతర వర్గాల పైన పోలీసులు అరచకాలు చేస్తుంటే మంత్రి పోలీసులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, 31న చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని విజయవంతం చేసి దళితులపై జరుగుతున్న దాడులను ఎండగడుతామని అన్నారు. దాడులకు బాధ్యత వహించి కేటిఆర్ రాజీనామా చేయాలని, అందుకు బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.